ప్రతిపక్షం, జూన్ 30: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా పథకం నిధులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
మొదటి విడతలో రెండు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.2,482 కోట్లను నేరుగా జమ చేయనున్నారు. ఈ పథకం కింద ఎకరానికి రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం.
దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా 73.32 లక్షల మంది రైతులకు చెందిన సుమారు కోటిన్నర ఎకరాలకు రూ.9 వేల కోట్ల వరకు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఆర్థిక సహాయం రైతులకు సాగు పెట్టుబడుల భారం తగ్గించడంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలకు ఊతమివ్వనుంది.
ఇటీవల కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా ఈ పథకం ప్రయోజనం పొందేందుకు అవకాశం కల్పించారు. వారు జులై 5లోపు సంబంధిత అధికారులకు దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టింది.
















