ప్రతిపక్షం, జూన్ 30: మెదక్ జిల్లాలో గర్భిణిపై డీఎన్‌ఏ పరీక్షల పేరుతో జరిగిన వేధింపులు విషాదానికి దారితీశాయి. పుట్టబోయే బిడ్డ తనదేనని నిరూపించాలంటూ భర్త పదేపదే డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకోవాలని ఒత్తిడి చేయడంతో పాటు అత్తమామలు కూడా మానసిక, శారీరక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులు తట్టుకోలేక గర్భిణి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
పోలీసుల వివరాల ప్రకారం, గత ఏడాది శ్రావణి, ప్రవీణ్ వివాహం చేసుకున్నారు. కొద్ది నెలల తర్వాత శ్రావణి గర్భవతి కావడంతో భర్త ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తరచూ డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయంలో అత్తమామలు కూడా భర్తకు మద్దతుగా నిలిచి కోడలిని మానసికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడైన భర్త ప్రవీణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అత్తమామల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోందని, ఫోన్ కాల్ రికార్డులు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
















