ముఖ్యమంత్రితో భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ భేటీ

ప్రతిపక్షం, జూన్ 30: ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలంగా మారిన అంశాలను ముఖ్యమంత్రి వివరించారు.

విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్న విధానాన్ని సీఎం వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

చందన్‌వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును వేగంగా ప్రారంభించాలని సునీల్ మిట్టల్‌ను కోరిన ముఖ్యమంత్రి, తెలంగాణలో సమగ్ర డేటా సెంటర్, కృత్రిమ మేధస్సు (AI) మౌలిక సదుపాయాల క్యాంపస్ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అలాగే హైదరాబాద్‌ను ఎయిర్‌టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, AI కార్యకలాపాలకు కీలక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు.

సమావేశంలో సునీల్ భారతి మిట్టల్ స్పందిస్తూ, భారతీ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని తెలిపారు. ఎయిర్‌టెల్‌కు హైదరాబాద్‌ను రెండో ప్రధాన కార్యాలయంగా పరిగణిస్తున్నామని, రాష్ట్రంలో డేటా సెంటర్ల సామర్థ్యాన్ని, ఫైబర్ కనెక్టివిటీని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News