ప్రతిపక్షం, జూలై 01: ముషీరాబాద్ డయారా మార్కెట్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ జెండా పండుగ కోసం ఏర్పాటు చేసిన పోస్టర్లను చింపేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు.
“మాతో పెట్టుకుంటే పుట్టగతులుండవు. దాదాగిరి, గుండాగిరి చెల్లవు. మేము తిరగబడితే మీ జెండాలు కూడా కనిపించవు. చేతనైతే పనిలో పోటీ పడండి, బెదిరింపులతో కాదు” అని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజల ఆశలు నెరవేర్చలేకపోయాయని విమర్శించిన కవిత, నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించడం, యువతకు స్వయం ఉపాధి కోసం భారీ రుణాలు, రైతు సంక్షేమం, సామాజిక న్యాయం వంటి అంశాలతో తమ పార్టీ ముందుకు వస్తోందన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించిన ఆమె, జులై 2న ఉప్పల్ భగాయత్‌లో భూపోరాటం నిర్వహిస్తామని ప్రకటించారు. ముషీరాబాద్‌లో ప్రజలు ఇప్పటికీ తాగునీరు, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందని కవిత ప్రకటించారు.


















