రైతు భరోసా నిధుల విడుదల.. తొలి విడతగా రూ.2,482 కోట్ల జమ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూలై 01: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి రూ.2,482.02 కోట్లను విడుదల చేశారు. ఈ నిధులు 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

వచ్చే తొమ్మిది రోజుల్లో మొత్తం రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను దశలవారీగా రైతులకు అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సుమారు 1,600 రైతు వేదికల ద్వారా రైతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, గత 30 నెలల్లో వ్యవసాయ రంగానికి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ కింద 25.35 లక్షల మంది రైతులకు రూ.20,677 కోట్ల ప్రయోజనం కల్పించామని చెప్పారు.

గత ప్రభుత్వ బకాయిగా ఉన్న రూ.7 వేల కోట్ల రైతు భరోసా నిధులను చెల్లించామని, రైతు భరోసా సాయాన్ని ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని పేర్కొన్నారు. తాజా విడతతో కలిపి రైతు భరోసా కింద మొత్తం రూ.36 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.

పంటల బోనస్‌కు రూ.4 వేల కోట్లు, వ్యవసాయ పనిముట్లకు రూ.2 వేల కోట్లు, పంటల బీమాకు రూ.3,500 కోట్లు, వడ్ల కొనుగోలుకు రెండున్నరేళ్లలో రూ.80 వేల కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు సీఎం తెలిపారు.

అదేవిధంగా గత ప్రభుత్వ అప్పుల కారణంగా రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడిందని ఆరోపించిన ఆయన, ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని, ఆర్టీసీ, విద్యుత్ సంస్థలను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. రైతులు వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలని కూడా సూచించారు.

Spread the love

Related News

Latest News