ప్రతిపక్షం, జూలై 01: హైదరాబాద్ మెహదీపట్నంలోని కింగ్స్ ప్యాలెస్‌లో నిర్వహించిన జాబ్ మేళాలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. సుమారు 150 కంపెనీలు, 2 వేల ఉద్యోగ అవకాశాలతో నిర్వహించిన ఈ జాబ్ మేళాను ఆమె అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, ఇంటర్వ్యూలో అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా సమాధానాలు ఇవ్వాలని యువతకు సూచించారు. తెలియని విషయాలను తెలియదని చెప్పి, నేర్చుకునేందుకు అవకాశం కోరితే ఉద్యోగదాతలు కూడా ప్రోత్సహిస్తారని అన్నారు.
అమెరికాలో తన తొలి ఉద్యోగ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, 2001లో ఉద్యోగ సంక్షోభ సమయంలో ఇంటర్వ్యూలో తెలియని ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం ఇచ్చానని, 20 రోజుల సమయం కోరగా నేర్చుకుని ఉద్యోగం సాధించానని తెలిపారు.
ప్రస్తుతం యూట్యూబ్ వంటి వేదికల ద్వారా ఉచితంగా ఎన్నో నైపుణ్యాలు నేర్చుకునే అవకాశాలు ఉన్నాయని, విజయానికి ఎలాంటి షార్ట్‌కట్ లేదని, కష్టపడి పనిచేస్తేనే లక్ష్యాలను సాధించవచ్చని యువతకు సూచించారు. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే ఉద్యోగ అవకాశాలు తప్పకుండా వస్తాయని, ఒకవేళ విఫలమైనా నిరాశ చెందకుండా మళ్లీ ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.



















