ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెల తొలి రోజే జీతాలు.. సీఎం ఆదేశాలతో నిధుల విడుదల

ప్రతిపక్షం, జూలై 02: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, గౌరవ వేతన సిబ్బందికి ఈ నెల తొలి తేదీనే జీతాలు విడుదలయ్యాయి. జీతాల చెల్లింపులో ఆలస్యం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఇటీవల అధికారులను ఆదేశించారు.

దీంతో ఆర్థిక శాఖ అన్ని శాఖలకు ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసి జీతాల బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆడిట్‌, ఆథరైజేషన్ ప్రక్రియలను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సూచించింది. ప్రతి నెల 25వ తేదీలోగా జీతాల బిల్లులను ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలకు పంపించాలని, నెలాఖరులోపు అన్ని ప్రక్రియలు పూర్తిచేసి తదుపరి నెల తొలి తేదీన ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

బుధవారం ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల చెల్లింపుపై ముఖ్యమంత్రి స్వయంగా ఆర్థిక శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెలకు సంబంధించిన బిల్లులు అందిన అన్ని శాఖల ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ చేసినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. దీంతో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికీ సమయానికి వేతనాలు అందే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు స్పష్టం అయింది.

Spread the love

Related News

Latest News