ఆదాయ పెంపే లక్ష్యం.. లీకేజీలకు చెక్, ప్రత్యేక ‘చేజింగ్ సెల్’ ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 02: రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే ఆదాయ సమీకరణపై అన్ని శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారు కె. రామకృష్ణారావుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో ఎలాంటి లీకేజీలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆదాయ సమీకరణను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ‘చేజింగ్ సెల్’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్ తదితర శాఖలు తమ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని, నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలని స్పష్టం చేశారు.

శాఖల వారీగా పనితీరును మెరుగుపరుచుకుని పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని, ముఖ్యంగా భూసేకరణను తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం రూపొందించే బడ్జెట్ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని, ఊహాగానాల ఆధారంగా కాకుండా ఆదాయ–వ్యయాలపై స్పష్టమైన అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. శాఖలకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Spread the love

Related News

Latest News