ప్రతిపక్షం, జూలై 02: దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అందించే రేషన్ బియ్యం నాణ్యతను మెరుగుపరిచేందుకు కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రేషన్ బియ్యంలో నూకల (బ్రోకెన్ రైస్) శాతాన్ని 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించగా, ఉప్పుడు బియ్యంలో అనుమతించే నూకల శాతాన్ని 16 శాతం నుంచి 5 శాతానికి కుదించింది.
ఈ మార్పుల వల్ల దేశవ్యాప్తంగా 80 కోట్లకు పైగా లబ్ధిదారులకు మరింత మెరుగైన నాణ్యత గల బియ్యం అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహార ధాన్యాలు అందించడమే ఈ నిర్ణయం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

















