ప్రతిపక్షం, జూలై 02: తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తొలి దశలో మంజూరు చేసిన 2.50 లక్షల ఇళ్లను ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి పూర్తిచేయాలని హౌసింగ్ శాఖ అధికారులకు స్పష్టమైన గడువు విధించింది. ఇప్పటికే నిర్మాణం గోడలు, స్లాబ్ దశకు చేరుకున్న ఇళ్లను ఆగస్టు 15 నాటికే పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది.
రెండో దశలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పూరి గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 37 వేల దరఖాస్తులను అధికారులు సర్వే చేయగా, అందులో సుమారు 5 వేల మంది అర్హులుగా గుర్తించినట్లు సమాచారం.
ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా పనులను వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

















