ప్రతిపక్షం, జూలై 02: అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. కేసులో నిందితులుగా ఉన్న వారి అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలపై కూల్చివేత చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లవ్‌కుశ్ మిశ్రా నిర్మిస్తున్న రెండంతస్తుల ఇంటికి అయోధ్య అభివృద్ధి సంస్థ నోటీసులు జారీ చేసింది. అయోధ్య–లక్నో జాతీయ రహదారి సమీపంలో ఉన్న స్థలంలో ఈ నిర్మాణం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు, గత ఐదేళ్లలో రామమందిర ట్రస్టుకు వచ్చిన విరాళాలు, వాటి వినియోగంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమగ్ర ఆడిట్ నిర్వహిస్తోంది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
















