ప్రతిపక్షం, జూలై 02: తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతి పీజేఆర్ హాల్‌లో నిర్వహించిన రాజనాల కళాతరంగిని షార్ట్ ఫిలిమ్స్ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. సినీ, సాంస్కృతిక రంగ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో సేవారంగంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ మూసా అలీ ఖాన్‌కు 101వ రాజనాల కళాతరంగిని అవార్డును ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.
రాజనాల సత్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపికైన షార్ట్ ఫిలిమ్స్‌ను ప్రదర్శించగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కార్యక్రమానికి నటుడు, నిర్మాత సాయి వెంకట్, సీనియర్ నటుడు తిలక్, దర్శకుడు మాగంటి ప్రసాద్ బాబు, నటి శ్రీమణి శ్రీలక్ష్మి, గుర్రం విజయ్ కుమార్‌తో పాటు పలువురు సినీ కళాకారులు, సాంస్కృతిక ప్రముఖులు, సినీ జర్నలిస్టులు హాజరై అవార్డు గ్రహీతలను అభినందించారు.
సేవారంగంలో చేసిన కృషికి గుర్తింపుగా డాక్టర్ మూసా అలీ ఖాన్‌కు శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తన సేవలను గుర్తించి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుతో గౌరవించిన తెలంగాణ సాంస్కృతిక శాఖ, రాజనాల కళాతరంగిని సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా సమాజ సేవను మరింత విస్తృతంగా కొనసాగిస్తానని పేర్కొన్నారు.
ప్రతి ఏడాది షార్ట్ ఫిలిమ్స్‌తో పాటు కళలు, సాహిత్యం, సామాజిక సేవ వంటి విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వ్యక్తులను రాజనాల కళాతరంగిని అవార్డులతో సత్కరించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన పలువురికి అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమం సినీ, సాంస్కృతిక రంగ ప్రముఖుల సమక్షంలో విజయవంతంగా ముగిసింది.
















