ప్రతిపక్షం, జూలై 02: రాష్ట్ర అప్పులు, అవినీతి అంశాలపై బహిరంగ చర్చకు సవాల్ విసిరిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి వెనక్కి తగ్గిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చకు వస్తామని ప్రకటించి చివరికి హాజరు కాలేదని ఆరోపించారు.
తాము ఉదయం 10 గంటలకే తెలంగాణ భవన్‌కు చేరుకుని చర్చ కోసం వేచి చూశామని, కానీ కాంగ్రెస్ నాయకులు ఎవరూ రాలేదని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర అప్పులు, అవినీతి ఆరోపణలపై ప్రజల ముందే వాస్తవాలను వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
“మీరు చేసిన అవినీతి, అప్పులపై బీఆర్ఎస్‌తో చర్చించేందుకు ఇంత భయం ఎందుకు? చేతకాని వాళ్లు సవాళ్లు ఎందుకు విసురుతున్నారు?” అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ మంత్రులు చర్చకు వచ్చి ఉంటే రాష్ట్ర ప్రజల ముందే అన్ని అంశాలపై స్పష్టత ఇచ్చేవాళ్లమని అన్నారు.
సవాల్ చేసి చివరకు చర్చకు రాకపోవడం ద్వారా ముఖ్యమంత్రి, మంత్రులకు సవాళ్లను స్వీకరించే ధైర్యం లేదని మరోసారి రుజువైందని కేటీఆర్ విమర్శించారు.
















