ప్రతిపక్షం, జూలై 03: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 1.50 లక్షల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్‌జీ పథకంపై రాష్ట్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా అమలు చేస్తుండటంతో, ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అయితే ఉపాధి హామీ కూలీలకు నష్టం కలగకుండా రాష్ట్రంలో ఆ పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా సనత్‌నగర్, ఎల్‌బీనగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రులతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకానికి మొత్తం 6,278 పోస్టులను మంజూరు చేసింది. ఈ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయడంతో పాటు, ఇక్కడ చికిత్స పొందే పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎల్‌ఓసీలు జారీ చేయాలని నిర్ణయించింది.
హైదరాబాద్‌లోని మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తొలి దశలో గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించి పనులను వేగవంతం చేయనున్నట్లు మంత్రులు వెల్లడించారు.

















