ప్రతిపక్షం, జూలై 03: తెలంగాణలో బీఆర్ఎస్ విసిరిన రాజకీయ సవాళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణాత్మక వైఖరిలోకి వెళ్లిందనే చర్చ అధికార పార్టీలోనే వినిపిస్తోంది. ఇటీవల రైతు భరోసా పథకం కింద మూడు విడతల్లో 61.35 లక్షల మంది రైతులకు రూ.5,402 కోట్ల ఆర్థిక సాయం అందించినప్పటికీ, ఆ కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో ప్రచారం దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర అప్పులు, గురుకులాల టెండర్ల అంశాలపై బీఆర్ఎస్ బహిరంగ చర్చకు సవాల్ విసరగా, కాంగ్రెస్ మంత్రులు కూడా చర్చకు సిద్ధమని ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ నేతలు చర్చకు వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో రాజకీయంగా గందరగోళం నెలకొంది.
దీంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కంటే ఈ రాజకీయ పరిణామాలే ప్రధాన చర్చగా మారాయని, ప్రజల దృష్టి కూడా వాటిపైనే కేంద్రీకృతమైందనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం.

















