ప్రతిపక్షం, జూలై 03: తెలంగాణ ప్రభుత్వ మంత్రులపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. అప్పుల అంశంలో ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన కాంగ్రెస్ మంత్రులే చివరికి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
సంగారెడ్డి పర్యటనలో మాట్లాడిన హరీశ్‌రావు.. తెలంగాణ భవన్‌కు వస్తానని ప్రకటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు చివరికి రాలేదని విమర్శించారు. గన్‌పార్క్ వద్ద చర్చకు రావాలని చెప్పి, పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం చర్చ నుంచి తప్పించుకుందని ఆరోపించారు.
జూపల్లి విడుదల చేసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1.77 లక్షల కోట్లుగా పేర్కొనగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం అది రూ.1.86 లక్షల కోట్లుగా ఉందని హరీశ్‌రావు తెలిపారు. జూపల్లి వెల్లడించిన లెక్కలు తప్పని తేలితే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
“పాలమూరు పౌరుషం, చీము, నెత్తురు ఉంటే మంత్రి జూపల్లి తన మాటకు కట్టుబడి రాజీనామా చేయాలి” అని హరీశ్‌రావు సవాల్ విసిరారు.

















