- బీఆర్ఎస్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, జూలై 3: కరీంనగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని, ఆ అప్పులపై వాస్తవాలు చెబితే కేటీఆర్, హరీశ్ రావు అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు.గత ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అప్పుల వడ్డీలు, వాయిదాలు చెల్లిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. బీఆర్ఎస్‌ను ప్రజలు ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తిరస్కరించారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిందని, రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసిందని, ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని చెప్పారు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గుర్తుచేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.1.20 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని, నేరెళ్ల ఘటన వంటి సంఘటనలు బీఆర్ఎస్ పాలనకు నిదర్శనమని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకోదగ్గ విదేశీ పెట్టుబడులు తీసుకురాలేకపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం భారీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఢిల్లీలో లోపాయికారీ ఒప్పందం కొనసాగిందని ఆరోపించిన ఆయన, రాష్ట్రంలో మాత్రం పరస్పరం ప్రత్యర్థులుగా నటించారని అన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు పలు కీలక బిల్లుల విషయంలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడి సభకు ఆశించిన స్థాయిలో ప్రజలు హాజరుకాలేదని, కేంద్రంలో 11 ఏళ్ల పాలనలో బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారం మోపారని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి వేలాది ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయంతో అమలు చేస్తోందని, ప్రజల విశ్వాసంతో రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచి మరోసారి అధికారంలోకి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.అంతకుముందు వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కరీంనగర్‌కు వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడికి చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


















