ప్రతిపక్షం, జూలై 03: తెలంగాణలో 20 వేల కానిస్టేబుల్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో 17 వేల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వమే ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు నియామక ప్రక్రియ చేపట్టకపోవడం నిరాశ కలిగిస్తోందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఎన్నికల హామీ లేకుండానే 47 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. అలాగే మొత్తం 2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి, 1.60 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీలు ఇంకా అమలు కాలేదని, దీంతో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలకు అనుగుణంగా వెంటనే 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.

















