ప్రతిపక్షం, జూలై 04, సికింద్రాబాద్: డివిజన్‌లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూనే, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు మాజీ కార్పొరేటర్ డా. సామల హేమ శుక్రవారం పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మహ్మద్‌గూడా పోచమ్మ ఆలయం పరిసర ప్రాంతంలో నెలకొన్న తాగునీటి సమస్యను స్థానికులు ఆమె దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఎమ్మెల్యే శ్రీ తీగుళ్ల పద్మారావు గౌడ్‌కు వివరించారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి తన స్వంత నిధులతో బోర్‌వెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించగా, బోర్‌వెల్ తవ్వకం పనులను డా. సామల హేమ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని, డివిజన్‌లో ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం బ్రాహ్మణబస్తీ, సీతాఫలమండి చర్చి గల్లీలో నెలకొన్న సివరేజీ సమస్యలను జలమండలి అధికారులతో కలిసి పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇదే సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా సీతాఫలమండి ప్రాంతంలో బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ)తో కలిసి ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. డా. సామల హేమ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. కుటుంబ సభ్యుల ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, పేర్లు, వయస్సు, చిరునామా తదితర వివరాలను సరిచూసుకుని ఫారాలను పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న ఫారాలను మూడు రోజుల తర్వాత బీఎల్‌ఓలు సేకరిస్తారని, ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో అందించాలని తెలిపారు. ఓటరు వివరాల్లో పొరపాట్లు లేకుండా చూసుకోవడం ద్వారా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో జలమండలి మేనేజర్ కుషాల్, బీఎల్‌ఓ రేవతి, బీఆర్‌ఎస్ నాయకులు గగన్, కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

















