ప్రతిపక్షం, జూలై 04: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన రెండు దశాబ్దాల రాజకీయ, ప్రజా జీవితాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. జడ్పీటీసీ (ZPTC) నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు సాగిన తన ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ, ఈ ప్రయాణం తన జీవితంలో మరపురాని అధ్యాయమని పేర్కొన్నారు.
“లక్షల అక్షరాలతో రాసినా.. కోట్ల పదాలను కూర్చి చెప్పినా.. తరగని మధుర జ్ఞాపకం ఈ రెండు దశాబ్దాల ప్రజాజీవితం” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. నాడు మిడ్జిల్‌లో రేవంత్ రెడ్డిగా ప్రారంభమైన తన ప్రయాణం, నేడు ప్రజల హృదయాల్లో “రేవంతన్న”గా నిలిచే స్థాయికి చేరిందని అన్నారు.
ప్రతి పోరాటంలో తనకు అండగా నిలిచిన ప్రజలు, కార్యకర్తలు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం, ఇదే స్ఫూర్తితో తెలంగాణ ప్రజలకు మరింత సేవ చేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రతిబింబించే పలు ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

















