రోశయ్య జీవితం నిలువెత్తు నిదర్శనంజయంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, జూలై 04: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 93వ జయంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావును మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య, ఎమ్మెల్యే వినోద్, మాజీ మంత్రి టీజీ వెంకటేష్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, వైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కాల్వ సుజాత, ఐఏఎస్ అధికారి వాణి ప్రసాద్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇదే వేదికపై కేఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లోగోను మంత్రులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ఘన నివాళులు అర్పించారు. రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, విలువలకు రోశయ్య ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో సేవలందించిన ఆయన శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు, ఆర్థిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, అనంతరం తమిళనాడు గవర్నర్‌గా అనేక కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తుచేశారు.ఆర్థిక వ్యవహారాలపై రోశయ్యకు అపారమైన పట్టు ఉండేదని, ప్రజాధనాన్ని అత్యంత బాధ్యతాయుతంగా వినియోగించాలనే దృక్పథం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు. రాజకీయ భేదాలకు అతీతంగా అందరి గౌరవాన్ని పొందిన నాయకుడిగా ఆయన నిలిచారన్నారు. ముఖ్యమంత్రిగా క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర పరిపాలనను సమర్థవంతంగా నడిపి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని తెలిపారు.

ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ హుందాతనం, సంయమనంతో వ్యవహరించడం రోశయ్య నాయకత్వానికి నిదర్శనమని మంత్రి అన్నారు. నేటి రాజకీయ నాయకులు, యువత ఆయన నిరాడంబర జీవనశైలి, ప్రజాసేవ పట్ల అంకితభావం, విలువలతో కూడిన రాజకీయాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
తన విద్యార్థి రాజకీయాల రోజుల నుంచే రోశయ్యతో సన్నిహితంగా మెలిగానని, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన రాజకీయ గురువు చొక్కారావుతో కలిసి పలుమార్లు ఆయనను కలిశానని పొన్నం ప్రభాకర్ తెలిపారు. తాను ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రోశయ్య పీసీసీ అధ్యక్షుడిగా, తాను ఎంపీగా ఉన్న సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు.ఆర్థిక క్రమశిక్షణకు రోశయ్య జీవితం నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్న మంత్రి, రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక క్రమశిక్షణ అత్యంత అవసరమని అన్నారు. రోశయ్యను ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తే సమాజం మరింత పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. తమిళనాడు గవర్నర్‌గా ఉన్న సమయంలోనూ, ఇతర కీలక హోదాల్లో ఉన్నప్పుడూ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Spread the love

Related News

Latest News