ప్రతిపక్షం, జూలై 04: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కారు డ్రైవర్ సీటు వద్ద ఉన్న కొబ్బరి బొండాం బ్రేక్, క్లచ్ పెడల్స్ కింద ఇరుక్కుపోవడంతో వాహనం అదుపు తప్పి ముందున్న లారీని ఢీకొట్టింది.
పోలీసుల వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన హరిప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో కుమారుడికి పెళ్లి సంబంధం చూసుకుని విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవింగ్ సమయంలో కొబ్బరి బొండాం పెడల్స్ కింద ఇరుక్కోవడంతో బ్రేక్ పనిచేయక ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడినట్లు సమాచారం. డ్రైవింగ్ చేసే సమయంలో డ్రైవర్ సీటు వద్ద లేదా పెడల్స్ సమీపంలో ఎలాంటి వస్తువులు ఉంచకూడదని ఈ ప్రమాదం మరోసారి హెచ్చరిస్తోంది.
















