ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, జూలై 04: ప్రజా జీవితంలో విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవ పట్ల ఆయన చూపుతున్న అంకితభావం, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సాగిస్తున్న పాలన మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.జడ్పీటీసీగా ప్రారంభమైన రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం ఆయన పట్టుదల, ప్రజల పట్ల నిబద్ధత, నిరంతర కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి పదవిని ప్రజా సేవకు వేదికగా మలుచుకుంటూ, ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న నాయకుడిగా ఆయన ఎదిగారని కొనియాడారు.ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, పేదలు, ఆదివాసి గిరిజనులు, బలహీన, అణగారిన వర్గాల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశిస్తున్నాయని పేర్కొన్నారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పాలన అందిస్తూ, సంక్షేమం అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని మంత్రులు అభిప్రాయపడ్డారు.
ప్రజా సేవలో రెండు దశాబ్దాల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజా జీవితంలో మరెన్నో విజయాలు సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.

Spread the love

Related News

Latest News