ప్రతిపక్షం, జూలై 04: సిద్దిపేట జిల్లా కొండపాకలోని సత్యసాయి సంజీవని శిశు హృదయాలయ ఆస్పత్రిలో 500 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు పూర్తైన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు విజయ్ దేవరకొండ, మాజీ మంత్రి హరీశ్ రావు హాజరై ఆస్పత్రి సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. దేశం నలుమూలల నుంచి చిన్నారులు ఇక్కడకు వచ్చి ఉచితంగా చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు చేతనైన సహాయం చేయాలని పిలుపునిచ్చారు. తన ఏడాది జీతాన్ని సత్యసాయి ఆస్పత్రికి విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో ఈ ఆస్పత్రిని పరిశోధనా కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తాను సత్యసాయి విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థినని, తన జీవితానికి అక్కడ పొందిన విలువలే పునాది అని అన్నారు. చిన్నారులకు ఉచితంగా గుండె చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్న వైద్య బృందం సేవలు అమూల్యమని కొనియాడారు. ఈ ఆస్పత్రి స్థాపనకు కృషి చేసిన హరీశ్ రావుతో పాటు ఆస్పత్రి చైర్మన్, వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు.

















