ఉరుకొండపేటలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు.. రూ.10 కోట్ల ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం

ప్రతిపక్షం, జూలై 04: రాజకీయ జీవితంలో తొలి విజయానికి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా ఉరుకొండపేటలో పర్యటించారు. తన రాజకీయ ప్రస్థానానికి చిరస్మరణీయమైన ఈ సందర్భంగా శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం, ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనతో ఉరుకొండపేట గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

రాజకీయ జీవితంలో జెడ్పీటీసీగా తొలి అడుగు వేసిన రోజులను గుర్తు చేసుకుంటూ గ్రామంలో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక ప్రజలు, ఆనాటి సహచరులు, గ్రామ పెద్దలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ వాద్యాలు, పూలమాలలు, నినాదాలతో ఆయనకు ఆత్మీయ ఆహ్వానం లభించింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ నాయకుడిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.10 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాయని అధికారులు తెలిపారు.

తదనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సీఎం తనతో కలిసి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సహచరులను కలుసుకున్నారు. ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి కుటుంబ సభ్యుల గురించి అడిగి తెలుసుకున్నారు. రెండు దశాబ్దాల క్రితం కలిసి పనిచేసిన మిత్రులతో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. కొందరు 20 ఏళ్ల క్రితం తీసుకున్న ఫొటోలను చూపించగా, వాటిని చూసి అప్పటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ చిరునవ్వులు చిందించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, వేమ్ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజకీయ ప్రస్థానంలో రేవంత్ రెడ్డి సాధించిన విజయాలను కొనియాడుతూ ఆయనకు అభినందనలు తెలిపారు.

రాజకీయ జీవితంలో 20 ఏళ్ల మైలురాయిని ప్రజల మధ్య జరుపుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని సీఎం పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం, సహచరుల అండదండలతోనే ఈ స్థాయికి చేరుకున్నానని, భవిష్యత్తులో కూడా తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Spread the love

Related News

Latest News