ప్రతిపక్షం, జూలై 04: ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. మద్యం మత్తులో జరిగిన గొడవలో తండ్రి తన కుమారుడిని కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తపల్లి సీతారాములు, ఆయన కుమారుడు కిరణ్ కుమార్ (35) కలిసి మద్యం సేవించి ఇంటికి వచ్చారు. అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, ఆగ్రహానికి గురైన సీతారాములు ఇంట్లో ఉన్న కత్తితో కుమారుడిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు కిరణ్‌ను రక్తపు మడుగులో గుర్తించి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన కల్లూరు పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు సీతారాములును పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

















