హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు వేగం కోరుతూ కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ లేఖ

ప్రతిపక్షం, జూలై 05: హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణను వేగవంతం చేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్‌కు లేఖలు రాసిన సీఎం, మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు తక్షణ ఆమోదం ఇవ్వడంతో పాటు ఫేజ్-1 స్వాధీనం ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా కేంద్రంతో చర్చలు జరిపిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రాజెక్టు అమలులో జాప్యం వల్ల వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మెట్రో ఫేజ్-1 విలువ నిర్ధారణ, స్వాధీనం ప్రక్రియ కోసం ఎస్‌బీఐ క్యాపిటల్స్‌కు వెంటనే బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సీఎం లేఖలో పేర్కొన్నారు. అలాగే ఫేజ్-1కు సంబంధించిన రుణాల రీఫైనాన్సింగ్ అవకాశాలను కూడా ఎస్‌బీఐ క్యాపిటల్స్ పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫేజ్-2 విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక రూపొందించేందుకు కేంద్రం సహకరించాలని, ఈ రెండు దశల ప్రాజెక్టులను సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్‌బీఐ క్యాపిటల్స్ నియామకంలో జరుగుతున్న జాప్యం వల్ల ఫేజ్-1 స్వాధీనం ప్రక్రియ నిలిచిపోతుండగా, ఫేజ్-2 డీపీఆర్‌ల ఆమోదం, నిధుల సమీకరణ కూడా ఆలస్యమవుతోందని సీఎం పేర్కొన్నారు. ఈ పరిస్థితి కొనసాగితే మెట్రో ఫేజ్-2 నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో మెట్రో విస్తరణ కీలకమని పేర్కొంటూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లాలని రేవంత్‌రెడ్డి తన లేఖలో కోరారు.

Spread the love

Related News

Latest News