ప్రతిపక్షం, జూలై 05: కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ పర్యటనను పోలీసులు అడ్డుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, సూపర్ ఎల్‌నినో వంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా కాళేశ్వరం వద్ద నీటి లభ్యత ఉంటుందని ఇంజినీర్లు సూచించడంతోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు గురించి తాను చిన్నప్పటి నుంచి వింటున్నప్పటికీ ఐదు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ పూర్తికాలేదని కేటీఆర్ అన్నారు. అయితే కాలంతో పోటీ పడుతూ కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ రైతులకు సాగునీరు అందించిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలు రాజకీయ ప్రేరేపితమైనవేనని, రైతుల ప్రయోజనాల కోసం నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను ప్రజలు బాగా అర్థం చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.















