కాళేశ్వరం కేసీఆర్‌కు అప్పగించండి.. లేకపోతే కన్నెపల్లి ముట్టడిస్తాం: కేటీఆర్

ప్రతిపక్షం, జూలై 05: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వహించే సామర్థ్యం లేకపోతే వారం రోజుల పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే రాష్ట్రవ్యాప్తంగా రిజర్వాయర్లను నింపి రైతులకు సాగునీరు అందించే బాధ్యత తమదేనని అన్నారు.

కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా ప్రవహిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. మోటార్లను ప్రారంభిస్తే కేవలం వారం రోజుల్లోనే రాష్ట్రంలోని రిజర్వాయర్లను నింపే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీటిని ఎత్తిపోయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటార్లను ప్రారంభించకపోతే 50 నుంచి 60 వేల మంది కార్యకర్తలతో పంప్‌హౌస్‌ను ముట్టడించి తామే పంపులను ఆన్ చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని, సాగునీటి అంశంలో ప్రభుత్వం రాజకీయాలు మానుకుని ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు.

Spread the love

Related News

Latest News