ప్రతిపక్షం, జూలై 05: హైదరాబాద్లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అర్హులైన పేద కుటుంబాలకు వారు ప్రస్తుతం ఉపాధి పొందుతున్న ప్రాంతాలకే సమీపంలో ఇళ్లు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నగరంలోని ప్రతి అర్హ కుటుంబానికి గృహ భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో 361 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు, తాళాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొత్తగా ఇళ్లు పొందిన కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
నగరంలోని పాత ప్రభుత్వ గృహాల పరిస్థితిపై సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. శిథిలావస్థకు చేరుకున్న లేదా మరమ్మతులు అవసరమైన గృహాలను గుర్తించి పునర్నిర్మాణం లేదా అభివృద్ధి చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారం వేగంగా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.















