2028లో బీసీలదే రాజ్యాధికారం.. ‘సర్జికల్ స్ట్రైక్-59’కు శ్రీకారం: తీన్మార్ మల్లన్న

ప్రతిపక్షం, జూలై 06: యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రాజ్యాధికార సమరభేరి’ బహిరంగ సభలో పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2028 ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని సాధించడమే తమ లక్ష్యమని ప్రకటిస్తూ ‘సర్జికల్ స్ట్రైక్-59’ పేరుతో ప్రత్యేక కార్యాచరణతో పాటు కౌంట్‌డౌన్ టైమర్‌ను ప్రారంభించారు. రాష్ట్ర రాజకీయాల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం కల్పించేందుకు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు.

అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యాన్ని విమర్శించిన మల్లన్న, సామాజిక న్యాయం కోసం తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. దొరల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని భూమిలేని పేదలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రాజకీయ, సామాజిక మార్పు కోసం ప్రజలు తమకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ సభలో పలువురు మేధావులు, మాజీ నక్సలైట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. అలాగే కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో అమరుల సందేశాలను వినిపించడం సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరుకావడంతో సభ ఉత్సాహభరితంగా సాగింది.

Spread the love

Related News

Latest News