ప్రతిపక్షం, జూలై 06: హనుమకొండ జిల్లాలోని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానుందని రైల్వే బోర్డు ఛైర్మన్ సతీశ్ కుమార్ తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించే నెక్స్ట్‌జెన్ రైల్వే కోచ్‌ల తయారీని ఈ ఫ్యాక్టరీలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తైందని, ఉత్పత్తి ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
ఫ్యాక్టరీని సందర్శించిన సతీశ్ కుమార్ నిర్మాణ పనులు, యంత్రాల ఏర్పాటు, ఉత్పత్తి సన్నాహాలను అధికారులతో కలిసి సమీక్షించారు. ఉత్పత్తికి అవసరమైన ఆధునిక యంత్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశామని, ప్రస్తుతం వాటి పనితీరును పరీక్షిస్తున్నట్లు తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక కోచ్‌ల తయారీ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం కావడం వల్ల తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ఊతం లభించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు రైల్వే రంగంలో తెలంగాణకు మరింత ప్రాధాన్యం తీసుకురానుందని పేర్కొన్నారు.
















