ప్రతిపక్షం, జూలై 06: హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ కూరగాయలు, పూల మార్కెట్‌ను రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్‌కు తరలించే ప్రతిపాదనను వెంటనే నిలిపివేయాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిర్ణయం అమలైతే మార్కెట్‌పై ఆధారపడి జీవిస్తున్న సుమారు 10 వేల కుటుంబాల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దక్షిణ, పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల ప్రజలు నిత్యావసర కూరగాయలు, పూల కొనుగోలుకు గుడిమల్కాపూర్ మార్కెట్‌పైనే అధికంగా ఆధారపడుతున్నారని, మార్కెట్‌ను దూర ప్రాంతానికి తరలిస్తే వ్యాపారులతో పాటు వినియోగదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
మార్కెట్ తరలింపుపై తుది నిర్ణయం తీసుకునే ముందు వ్యాపారులు, రైతులు, హమాలీలు, ఇతర సంబంధిత వర్గాలతో ప్రభుత్వం విస్తృతంగా చర్చలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. ప్రజల జీవనోపాధి, వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
















