ప్రతిపక్షం, జూలై 06: హైదరాబాద్‌లోని సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సామాన్యుల నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న హైడ్రా, ఈ వ్యవహారంలో మాత్రం మౌనం పాటించడం పక్షపాత వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
హైకోర్టు పలుమార్లు ప్రశ్నించినప్పటికీ ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. ప్రజలందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను వేర్వేరుగా అమలు చేయడం సరికాదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన కిషన్‌రెడ్డి, హైడ్రా చర్యలతో సామాన్య ప్రజల ఇళ్లు కూల్చివేస్తూ, ఫాతిమా విద్యాసంస్థల విషయంలో మాత్రం జాప్యం చేయడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పి చట్టబద్ధంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సల్కం చెరువు ఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకుని, అవసరమైతే ఫాతిమా విద్యాసంస్థల నిర్మాణాలను తొలగిస్తామని ప్రకటించారు. విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
ఫాతిమా విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తోందని ప్రశ్నించిన బండి సంజయ్, హైకోర్టు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా జాప్యం చేయడం వెనుక కారణాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఒవైసీకి ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అని ప్రశ్నిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలని కోరారు.

















