ప్రతిపక్షం, జూలై 06: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేత గంగుల కమలాకర్ తీవ్రంగా విమర్శించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టుపై సరైన అవగాహన లేదని, వాస్తవాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌కు మేడిగడ్డ బ్యారేజీతో ప్రత్యక్ష సంబంధం లేదని, అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయడం సాంకేతికంగా సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో సాగునీటి పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని, అనేక ప్రాంతాలు సస్యశ్యామలంగా మారాయని గంగుల కమలాకర్ అన్నారు. రైతులకు నీరు అందించే సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పంపింగ్‌ను నిలిపివేస్తోందని విమర్శించారు.
అలాగే అధికారంలోకి వచ్చి 30 నెలలు పూర్తవుతున్నా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పనులను ఎందుకు ప్రారంభించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ ఆరోపణలు చేయడం కంటే రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సాగునీటి సరఫరాపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన సూచించారు.

















