తెలంగాణకు మూడు కొత్త విమానాశ్రయాలు.. ఏవియేషన్ రంగంలో కీలక అడుగు

ప్రతిపక్షం, జూలై 06: తెలంగాణలో విమానయాన రంగాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్రానికి మరో మూడు కొత్త విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు వేగవంతమయ్యాయి. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, వచ్చే నెలలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

అదిలాబాద్‌లో రక్షణ శాఖ, పౌర విమానయాన విభాగం సంయుక్తంగా సుమారు 1,500 ఎకరాల్లో విమానాశ్రయంతో పాటు ఏవియేషన్ శిక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికను అమలు చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా విమానయాన శిక్షణతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఊతం లభించనుంది.

మరోవైపు కొత్తగూడెంలో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి సంబంధించిన సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. కేంద్రం నుంచి అనుమతులు లభించిన వెంటనే తదుపరి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఈ మూడు విమానాశ్రయాలు పూర్తయితే తెలంగాణలో ప్రాంతీయ విమాన రాకపోకలు మరింత విస్తరించడంతో పాటు పరిశ్రమలు, పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలకు కొత్త ఊపు లభించనుంది. రాష్ట్రాన్ని దేశీయ, అంతర్జాతీయ కనెక్టివిటీలో మరింత బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

Spread the love

Related News

Latest News