ప్రతిపక్షం, జూలై 06: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా కొనసాగిస్తోందని అన్నారు.
ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజల అవసరాల కంటే కమీషన్ల కోసమే నిర్మించారని ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని పేర్కొన్న మంత్రి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
















