ప్రతిపక్షం, జూలై 06: తెలంగాణలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రాష్ట్రంలో చేపట్టిన పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని అటవీ భూములను వినియోగించి ఎకో టూరిజాన్ని విస్తరించాలని, నగరాన్ని దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని, గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో మరిన్ని ఎకో పార్కులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తారామతి బారాదరిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే మంజీరా, దిల్‌కుషా అతిథి గృహాలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
టూరిజం హబ్ డెవలప్‌మెంట్ పథకం కింద వికారాబాద్‌ను ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ముఖ్యంగా అక్కడి శ్రీ వీరభద్రస్వామి దేవాలయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, యాదగిరిగుట్ట తరహాలో దేవస్థానానికి పాలక మండలిని ఏర్పాటు చేయాలని చెప్పారు. క్యూర్ పరిధిలో అర్బన్ ఫారెస్ట్ నమూనాలో ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేసి, వాటి అమలుకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు.
హైదరాబాద్‌లోని పురానాపూల్ వంటి వారసత్వ కట్టడాలను సంరక్షిస్తూ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని, అవసరమైతే ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించి పర్యాటకులకు అనువైన వాతావరణం కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించి, పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ శాఖల సమన్వయంతో ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


















