ప్రతిపక్షం, జూలై 07: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్‌రెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఏసీబీ అధికారులు ఆయన నివాసం సహా పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో రూ.200 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులు గుర్తించినట్లు వెల్లడించారు. తొలుత అనారోగ్య కారణాలతో అరెస్టు చేయకుండా నోటీసులు జారీ చేసిన అధికారులు, అనంతరం భీమ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఆయనను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఏసీబీ అధికారులు భీమ్‌రెడ్డిని చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల మూలాలపై ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. మరికొందరి పాత్రపై కూడా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
















