ప్రతిపక్షం, జూలై 07: హైదరాబాద్ మెట్రోలో టికెట్ జారీ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజేషన్ దిశగా తీసుకెళ్తుండటంతో పలు స్టేషన్లలో టికెట్ కౌంటర్లను మూసివేస్తున్నారు. టికెట్ వెండింగ్ మెషీన్లు (టీవీఎంలు), డిజిటల్ చెల్లింపుల ద్వారా మాత్రమే టికెట్లు తీసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు. దీంతో ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు, డిజిటల్ లావాదేవీలపై అవగాహన లేని వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమీర్పేట్ సహా పలు రద్దీ మెట్రో స్టేషన్లలో టికెట్ కౌంటర్లు మూసివేయడంతో టీవీఎంల ద్వారా టికెట్లు తీసుకోవాల్సి వస్తోంది. అయితే యంత్రాల వినియోగంపై సరైన అవగాహన లేక కొంతమంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, అందరికీ డిజిటల్ విధానంపై అవగాహన ఉండదని ప్రయాణికులు పేర్కొంటున్నారు.
అమీర్పేట్, మియాపూర్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్, రాయదుర్గం వంటి రద్దీ స్టేషన్లలో కనీసం టికెట్ కౌంటర్లను కొనసాగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. డిజిటలైజేషన్ అవసరమే అయినప్పటికీ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మానవ సహాయం కూడా అందుబాటులో ఉండే హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయాలని పట్టణ రవాణా నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం మెట్రో ప్రయాణికుల మధ్య చర్చనీయాంశంగా మారింది.


















