ప్రతిపక్షం, జూలై 07: తెలంగాణ సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఉన్న ఆరో అంతస్తులో క్యాటరింగ్ సేవలు నిలిచిపోయినట్లు సమాచారం. గత రెండేళ్లుగా అందించిన సేవలకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ ఆహార సరఫరాను నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కార్యాలయం సహా పలు విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం.
సంబంధిత బిల్లులను కనీసం విడతల వారీగా చెల్లించాలని కాంట్రాక్టర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందన రాకపోవడంతో సేవలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో సమావేశాలు, అధికారిక కార్యక్రమాల్లో అందించే అల్పాహారం, భోజనం, టీ, కాఫీ వంటి సేవలకు అంతరాయం ఏర్పడింది.
అయితే ఈ అంశంపై ప్రభుత్వం లేదా సంబంధిత శాఖలు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. బిల్లుల చెల్లింపులు, సేవల పునరుద్ధరణపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

















