ప్రతిపక్షం, జూలై 07: సింగరేణి కాలరీస్ సంస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల-2 కోల్ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు.
తాడిచర్ల-2 కోల్ బ్లాక్‌లో సుమారు 40 నుంచి 50 సంవత్సరాల పాటు నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ కేటాయింపుతో సింగరేణి సంస్థ ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరిగి, సంస్థ దీర్ఘకాలిక అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
అలాగే ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌కు అవసరమైన అన్ని అనుమతులను కూడా సింగరేణికి ఇప్పించినట్లు మంత్రి వెల్లడించారు. అక్కడ ఇప్పటికే బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపారు. భవిష్యత్తులో కూడా సింగరేణి విస్తరణ, ఉత్పత్తి పెంపు, ఉద్యోగావకాశాల సృష్టికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

















