ప్రతిపక్షం, జూలై 07: హైదరాబాద్ రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో మరో కీలక ఘట్టానికి వేదికగా నిలవనుంది. ప్రపంచ ప్రఖ్యాత ఫ్రాన్స్‌కు చెందిన డాసాల్ట్ ఏవియేషన్ మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంయుక్తంగా హైదరాబాద్‌లో తొలి రఫేల్ యుద్ధ విమానాల విడిభాగాల తయారీ కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభించాయి. ఫ్రాన్స్ వెలుపల రఫేల్ విమాన భాగాలు తయారయ్యే తొలి కేంద్రంగా ఇది గుర్తింపు పొందనుంది.
ఈ అత్యాధునిక తయారీ కేంద్రంలో రఫేల్ యుద్ధ విమానాల ముందుభాగం (ఫ్రంట్ ఫ్యూజ్‌లేజ్), వెనుక భాగాలు (రియర్ ఫ్యూజ్‌లేజ్)తో పాటు పలు కీలక నిర్మాణ భాగాలను అత్యున్నత ప్రమాణాలతో తయారు చేయనున్నారు. ఇప్పటివరకు ఈ భాగాల తయారీ పూర్తిగా ఫ్రాన్స్‌కే పరిమితమై ఉండగా, ఇప్పుడు భారత్‌కు ఆ అవకాశం రావడం దేశ రక్షణ రంగానికి పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ అంతర్జాతీయ ఏరోస్పేస్ తయారీ కేంద్రంగా మరింత బలోపేతం కానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాష్ట్రానికి అందుబాటులోకి రావడంతో పాటు స్థానిక పరిశ్రమలకు, అనుబంధ సంస్థలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. వేలాది మంది నైపుణ్య కలిగిన యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
భారత్‌లో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఈ కేంద్రం కీలక బలాన్ని అందించనుంది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఇది మరింత ఊతమివ్వనుంది. భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఇక్కడ తయారయ్యే భాగాలను ఎగుమతి చేసే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమైన ఈ కేంద్రంలో 2028 సంవత్సరం నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుంది. దీంతో హైదరాబాద్ ప్రపంచ రక్షణ పరిశ్రమలో మరింత కీలక స్థానాన్ని సంపాదించనుండగా, తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు మరో మైలురాయిగా నిలవనుంది.

















