కాళేశ్వరం కూలిపోవడానికి కేసీఆరే కారణం.. బీఆర్ఎస్‌పై మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు

ప్రతిపక్షం, జూలై 07: కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత దెబ్బతిని సమస్యలు తలెత్తడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అసలైన ఇంజినీర్ల సలహాలను పక్కనబెట్టి తానే ఇంజినీర్‌లా వ్యవహరించడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత దెబ్బతిని “కూళేశ్వరం”గా మారిందని ఆయన విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించిన మహేశ్ కుమార్ గౌడ్, ఈ అంశంపై బీఆర్ఎస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులదేనని పేర్కొన్నారు.

వారం రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును తమకు అప్పగిస్తే రాష్ట్రవ్యాప్తంగా నీళ్లు అందిస్తామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. అధికారంలో దాదాపు తొమ్మిదిన్నరేళ్లు ఉన్న సమయంలో ప్రాజెక్టు నిర్వహణలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకుండా, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలు, అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ స్పష్టత ఇవ్వాలని మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News