తాగునీటి సమస్యకు చెక్.. ముందస్తు చర్యలకు మంత్రి సీతక్క ఆదేశాలు

ప్రతిపక్షం, జూలై 07: రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె తాగునీటి సరఫరా పరిస్థితిని పరిశీలించి పలు కీలక సూచనలు చేశారు.

ఎల్‌నినో ప్రభావం కారణంగా నీటి వనరులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఎండాకాలంలోనూ ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

సింగూర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో దాని పరిధిలోని జిల్లాల్లో ప్రత్యామ్నాయంగా భూగర్భ జలాల ఆధారిత తాగునీటి పథకాలను అమలు చేయాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోర్‌వెల్లు తవ్వడం, ఇప్పటికే ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

నీటి కొరతకు అవకాశం ఉన్న గ్రామాలు, పట్టణాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ప్రతి జిల్లాలో తాగునీటి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యమని పేర్కొన్న మంత్రి సీతక్క, ఎలాంటి పరిస్థితుల్లోనూ నీటి సమస్య తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ముందస్తు ప్రణాళికలు, ప్రత్యామ్నాయ నీటి వనరుల అభివృద్ధితో రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరాను సజావుగా కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.

Spread the love

Related News

Latest News