ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, జూలై 8: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సందేశంలో వైఎస్సార్‌ను పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజానేతగా అభివర్ణించారు.డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, రైతు కష్టాన్ని తన కష్టంగా భావించిన నాయకుడని మంత్రి పేర్కొన్నారు. పేదల ఆరోగ్యాన్ని ప్రభుత్వ బాధ్యతగా మార్చి, విద్య, వైద్యం, సాగునీరు, గృహనిర్మాణం, సామాజిక భద్రత వంటి రంగాల్లో సంక్షేమ పాలనకు కొత్త నిర్వచనం ఇచ్చిన మహానుభావుడని కొనియాడారు.ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావడం, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు కల్పించడం, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడం వంటి పథకాలు వైఎస్సార్ సంక్షేమ దృక్పథానికి నిదర్శనాలని తెలిపారు.పాలన అంటే కేవలం కార్యాలయాల నిర్వహణ కాదని, పేదవాడి జీవితంలో సానుకూల మార్పు తీసుకురావడమే నిజమైన పాలన అని వైఎస్సార్ తన పాలనతో నిరూపించారని మంత్రి అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సామాజిక న్యాయం, పేదలు, రైతులు, విద్యార్థులు, అణగారిన వర్గాల అభ్యున్నతినే తనరాజకీయ సిద్ధాంతంగా భావించిందని, వైఎస్సార్ సంక్షేమ స్ఫూర్తి కూడా అదే కాంగ్రెస్ సిద్ధాంతానికి ప్రతిబింబమని పేర్కొన్నారు.వైఎస్సార్ జయంతి సందర్భంగా పేదల పక్షాన నిలిచే పాలనకు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీల అభ్యున్నతికి మరింత అంకితభావంతో కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.వైఎస్సార్ సేవలు చిరస్మరణీయమని, ఆయన సంక్షేమ స్ఫూర్తి భావితరాలకు శాశ్వత మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

















