పిల్లల ఆరోగ్యం–నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం.. బాలామృతం కొత్త ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూలై 08: రాష్ట్రంలోని ప్రతి చిన్నారి ఆరోగ్యవంతంగా ఎదిగి, నాణ్యమైన విద్యతో భవిష్యత్‌కు బలమైన పునాది ఏర్పడాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నాచారం ఐడీఏలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన బాలామృతం ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ప్లాంట్‌లోని ఉత్పత్తి, ప్యాకింగ్ ప్రక్రియను పరిశీలించి, ప్రాంగణంలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీల నుంచి ఆరు సంవత్సరాల లోపు చిన్నారుల వరకు పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ఆధునిక బాలామృతం ప్లాంట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు సంతోషంగా ఉంటాయని, ఆరోగ్యవంతమైన పిల్లలే రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు బలమని పేర్కొన్నారు.

పిల్లల ఆరోగ్యం, విద్య విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని సీఎం స్పష్టం చేశారు. నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాల విద్యను అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. ప్రతి చిన్నారి శారీరకంగా, మానసికంగా బలంగా ఎదగాలంటే ఇలాంటి ఆధునిక పోషకాహార ఉత్పత్తి కేంద్రాలు మరింత అవసరమని అభిప్రాయపడ్డారు.

గతంలో మహబూబ్‌నగర్‌లో ప్రారంభమైన బాలామృతం యూనిట్ ఇప్పుడు విస్తరించి 21 ఎకరాల్లో భారీ పరిశ్రమగా అభివృద్ధి చెందిందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా పోషకాహారం సరఫరా చేసే స్థాయికి చేరుకుందని ముఖ్యమంత్రి తెలిపారు.

విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను ప్రస్తావిస్తూ, గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్య అందుబాటులో లేకపోవడంతో పేద కుటుంబాలు ప్రైవేటు పాఠశాలలపై ఆధారపడాల్సి వచ్చేదన్నారు. ఆ పరిస్థితిని మార్చేందుకు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం చిరుతిండి అందిస్తున్నామని తెలిపారు.

విద్యను ఖర్చుగా కాకుండా భవిష్యత్తుపై పెట్టుబడిగా భావిస్తున్నామని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది సుమారు రూ.27 వేల కోట్లను విద్యారంగానికి కేటాయిస్తోందని సీఎం వెల్లడించారు. నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన, సమర్థవంతమైన పౌరులను తయారు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.

మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలకు రుణాలు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, పెట్రోల్ బంకుల కేటాయింపు, ఆర్టీసీకి అద్దె బస్సుల పథకం, ఇందిరా మహిళా శక్తి కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా క్యాంటీన్లు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.

హైదరాబాద్‌లో భూముల ధరలు భారీగా పెరిగినా పేదల కోసం లక్ష ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే 2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉపాధి, స్వయం ఉపాధి, వ్యాపార అవకాశాలను విస్తరించే సమగ్ర కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.

Spread the love

Related News

Latest News