ప్రతిపక్షం, జూలై 08: ఫిఫా వరల్డ్ కప్–2026లో భాగంగా అర్జెంటీనా–ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి వీక్షించారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై మ్యాచ్‌ను తిలకించిన సీఎం, విద్యార్థులతో కలిసి ఆటను ఆస్వాదించారు.
మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి నిమిషం వరకు విద్యార్థుల కేరింతలు, ఉత్సాహ నినాదాలతో శిల్పకళా వేదిక సందడిగా మారింది. ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను అలరించిన ఈ పోరులో అర్జెంటీనా జట్టు 3–2 గోల్స్ తేడాతో ఈజిప్ట్‌పై విజయం సాధించగా, విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇటీవల హైదరాబాద్ పర్యటనతో రాష్ట్రంలో ఫుట్‌బాల్‌కు కొత్త ఊపు వచ్చిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను ప్రత్యేకంగా విద్యార్థులకు వీక్షించే అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. క్రీడల పట్ల యువతలో ఆసక్తి పెంపొందించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి క్రీడా స్ఫూర్తిని పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గత డిసెంబర్లో మెస్సీ హైదరాబాద్‌లో పర్యటించి ఉప్పల్ స్టేడియంలో అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. ఆయన సందర్శన రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు, విద్యార్థులకు విశేష ప్రేరణగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల్లో ఫిట్నెస్, జట్టు భావన, పోటీతత్వాన్ని పెంపొందించే కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.




















