ప్రతిపక్షం, జూలై 08: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ లావాదేవీల్లో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భూ రికార్డులు, రిజిస్ట్రేషన్లలో చోటుచేసుకున్న అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు విజిలెన్స్ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ధరణి పోర్టల్ ద్వారా జరిగిన సుమారు 8 లక్షల భూ లావాదేవీలపై అధికారులు ఆడిట్ నిర్వహించగా, దాదాపు 22 వేల రిజిస్ట్రేషన్లలో అనుమానాస్పద అంశాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీల్లో భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో సెక్యూరిటీ వ్యవస్థను బైపాస్ చేసి రిజిస్ట్రేషన్లు నిర్వహించినట్లు ప్రాథమిక విచారణలో బయటపడినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అవసరమైతే సిట్ ఏర్పాటు చేసి మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.
భూ రికార్డుల భద్రత, పారదర్శకతను మరింత బలోపేతం చేయడంతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆడిట్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
I prefer this response
















