ప్రతిపక్షం, జూలై 08: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పలువురు కార్యకర్తలు ప్రాణత్యాగం కూడా చేశారని గుర్తు చేశారు. అయితే తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవని, అందువల్ల రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం మరింత సులభమని నితిన్ నబీన్ అభిప్రాయపడ్డారని తెలిపారు.
తెలంగాణలో పార్టీ బలోపేతానికి బీజేపీ క్రమబద్ధంగా పనిచేస్తోందని, ప్రజల్లో పార్టీకి ఆదరణ పెరుగుతోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ అంశంపై కూడా కేంద్ర మంత్రి స్పందించారు. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిన అనంతరం కేంద్రం వాటిని పరిశీలించి తగిన నిర్ణయం ప్రకటిస్తుందని ఆయన చెప్పారు.
















